Monday, September 28, 2009

నాడు పి.వి.నరసింహారావు - నేడు రోశయ్య


        సారుప్యత అంటే ఇదేనేమో ... వారసత్వ రాజకీయాలకు పేరుగాంచిన కాంగ్రెస్ లో సారూప్య రాజకీయాలకు తెరలేచింది. అప్పట్లో రాజీవ్ గాంధీ మరణానంతరం పి.వి. నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన గాంధీ - నెహ్రూ కుటుంబ వారసుడు కాదు, వారి విధేయుడు మాత్రమే. రాజీవ్ హత్య దురదృష్టకరమే అయినప్పటికీ... ఆ సంఘటన పి.వి. నరసింహారావు లాంటి మేధావిని, మన్మోహన్ సింగ్ లాంటి గొప్ప ఆర్దికవేత్తను ఈ దేశానికీ అందించింది. పి.వి హయాం లోనే ప్రపంచ బ్యాంకు వద్ద తాకట్టు పెట్టిన 200 టన్నుల బంగారాన్ని విడిపించడం జరిగింది. అప్పట్లో పార్టీ, ప్రధాని పగ్గాలను చేపట్టాలని సోనియా గాంధీని కోటరీ ( గాంధీ - నెహ్రూ కుటుంబ విధేయులు) ఒత్తిడి చేసినప్పటికి ఆమె ఎందుకో తిరస్కరించారు.

                                                     







          
  అలాగే ఇప్పుడు ముఖ్యమంత్రి వై. ఎస్. రాజశేఖర్ రెడ్డి మరణానాతరం అనుభవశాలి, సమర్ధుడు, పొదుపరి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఎరిగిన రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. కానీ... జగన్ సి.ఎం కావాలని ఆయన మద్దతుదారులు, అభిమానులు కోరుతున్నా... జగన్ తిరస్కరించకపోవడం గమనార్హం. ఉద్యోగసంఘాల  డిమాండ్లకి  తల ఒగ్గడం, అవసరం లేకపోయినా జనాకర్షక పధకాలను ప్రవేశపెట్టడంతో  రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఖజానా పై భారం పెంచేసారు. ప్రస్తుతం రోశయ్య ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ఆర్ధిక  పరిస్థితి గాడిలో పడుతున్దనడానికి శకునం.

ఆంధ్రులకు ఆత్మాభిమానం తక్కువా? (సెప్టెంబర్ 28 , 2009 నాటి పునః ప్రచురణ)


 అవును అనే సమాధానం చెప్పాలి.తెలుగువారికి ఆత్మగౌరవం, భాషాభిమానం చాలా తక్కువ. ఈ విషయం ఎన్నోసార్లు  రుజువయ్యింది.ఈ విషయంలో తమిళులు, కన్నడిగులు, మలయాళీలు, మరాఠీలు, బెంగాలీలు  మరియు ఇతర ప్రాంతీయ భాషాభిమానుల కంటే తెలుగువారు చాలా వెనుకబడ్డారు.  తెలుగుకు ప్రాచీనభాష  హాదా సాధించడంలో గాని, తెలుగును వ్యావహారిక భాషగా మరింత అభివృద్ధి చేయడంలో తెలుగువారి స్పందన అంతంతమాత్రమే. ఈ విషయంలో ప్రజలకంటే పాలకులు మరింత వెనుకబడ్డారు. రాష్ట్రానికి సంబందించిన ప్రాజెక్టుల సాధనలో మన రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీనికి కారణం వారిలో రాష్ట్రాభిమానం, భాషాభిమానం లేకపోవడం. ఇతర రాష్ట్రాలకి  చెందిన పార్లమెంటు సభ్యులు రాజకీయాలకు అతీతంగా ప్రాజెక్టులు సాధించుకుపోతుంటే మనవాళ్ళు తెల్లమొగాలు వేసుకుచూస్తున్నారు. దీనికి ప్రబల ఉదాహరణ రైల్వే బడ్జెట్ కేటాయింపులు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మన ఎం.పి లు రాజకీయ బాసులకు భయపడి నోరెత్తకపోవడం మరీ దారుణం. ఈ ఉదాసీనత ప్రాజెక్టుల సాధనలోనే గాకుండా  ప్రజల సొమ్ముతో చేపట్టే ప్రభుత్వ నిర్మాణాలకు, ప్రాజెక్టులకు రాష్ట్ర నాయకుల పేర్లు పెట్టడంలో కూడా కనిపిస్తుంది. దీనికి ఉదాహరణ  హైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ  పేరు పెట్టడం. ఈ చర్య తెలుగు జాతిని, సంసృతిని అవమానించడమే.అసలు రాజీవ్ గాంధీకి ఆంధ్ర సంస్క్రుతికి సంబంధం  ఏమిటి ?  ఈ రాష్ట్రానికి ఆయన ప్రత్యేకంగా ఏమి చేసారు? విమానాశ్రయానికి పేరు పెట్టించుకునేటంత గొప్ప వ్యక్తులు ఈ రాష్ట్రంలో పుట్టలేదా?   ఇలాంటి విషయాల్లో మిగతా రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలూ ఎలా స్పందిస్తున్నాయి?  ప్రభుత్వ నిర్మాణాలకు పేర్లు పెట్టేటప్పుడు  స్థానిక ప్రజల మనోభావాలను, సంస్క్రుతిని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం . ఈ విషయంలో మిగతా రాష్త్రాలు చాలా ముందున్నాయి. ఆ విషయం క్రింది విమానాశ్రయాల పేర్లు పరిశీలిస్తే అర్థమవుతుంది. 


 1. అమృతసర్ అంతర్జాతీయ విమానాశ్రయం( పంజాబ్ ) ------గురు రాందాస్ అంతర్జాతీయ విమానాశ్రయం, అమృతసర్
     


    గురు రాందాస్  సిక్కుల పదో మత గురువు మరియు అమృతసర్ పట్టణ నిర్మాత.


2. శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీనగర్ (జమ్మూ & కాశ్మీర్ ) -----  షేక్- ఉల్-ఆలం అంతర్జాతీయ విమానాశ్రయం,శ్రీనగర్   
     15  వ శతాభ్దానికి చెందిన షేక్- ఉల్- ఆలం  అసలు పేరు షేక్- నూర్- ఉద- దిన్- నూరాని . ఈయన ప్రముఖ కష్మీరీ కవి.ముస్లింలకు, హిందువులకు ఆరాధ్యుడు. శ్రీనగర్ సమీపంలోని కటిముష గ్రామంలో జన్మించారు.
 
3. నాగపూర్ అంతర్జాతీయ విమానాశ్రయం (మహారాష్ట్ర) -------- డా. బి. ఆర్. అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం , నాగపూర్

 
     భారతరత్న  బి. ఆర్. అంబేద్కర్ - ప్రముఖ సామాజిక- ఆర్ధిక- రాజకీయవేత్త , మేథావి, భారతరాజ్యాంగ నిర్మాత. స్వతంత్ర భారతదేశ  మొదటి     న్యాయశాఖ మంత్రి. మహారాష్ట్ర లోని  రత్నగిరి జిల్లాలో జన్మించారు. 
   
4. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం (గుజరాత్) -------సర్దార్ వల్లభ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం, అహ్మదాబాద్


        వల్లభ భాయ్ పటేల్ - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, స్వతంత్ర భారతదేశ మొదటి హోం మంత్రి మరియు ఉప ప్రధాని,ఉక్కుమనిషి. హైదరాబాద్ లోని నిజాం సంస్థానం భారతదేశంలో విలీనం కావడానికి కారకుడు. గుజరాత్ లోని నడయాద్ గ్రామంలో జన్మించారు.


5.  కోల్కతా అంతర్జాతీయ విమానాశ్రయం (పశ్చిమ బెంగాల్)-------  నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం,కలకత్తా  

             ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఇండియన్ నేషనల్ ఆర్మీ( INA) స్థాపకులు. జాతీయ కాంగ్రెస్ లో  గాంధీ- నెహ్రూ లతో కలిసి కొంతకాలం పనిచేసారు. అనుమానాస్పదంగా అదృశ్యమయ్యారు. కటక్( ఒరిస్సా) లో జన్మించారు.    


6.  గౌహతి అంతర్జాతీయ విమానాశ్రయం (అస్సాం) --------  లోకప్రియ గోపీనాథ్ బర్దోలి  అంతర్జాతీయ విమానాశ్రయం, గౌహతి.




         లోకప్రియ గోపీనాథ్ బర్దోలి - ప్రముఖ స్వతంత్ర సమరయోధులు, భారతరత్న, అస్సాం రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి . 
   
7. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం( మహారాష్ట్ర ) --------- చత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై 

    చత్రపతి శివాజీ -  ఔరంగజేబును ముప్పుతిప్పలు పెట్టిన చారిత్రక మరాఠా వీరుడు . దుర్గామాత అనుగ్రహం పొందిన వీరుడు. 

8. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం (తమిళనాడు) ------- అన్నా అంతర్జాతీయ విమానాశ్రయం, మద్రాసు 


    కంజీవరం నటరాజన్ అన్నాదురై (అన్నా) ----  ద్రవిడ ఉద్యమ నేత, తమిళనాడులో హిందీ వ్యతిరేకోద్యమ నాయకుడు, ద్రవిడ మున్నేట్ర కజగమ్( DMK)పార్టీ వ్యవస్థాపకుడు .
   చెన్నై జాతీయ విమానాశ్రయం (తమిళనాడు) ---- కామరాజ్ నాడార్ జాతీయ విమానాశ్రయం,మద్రాసు
 
 
  కామరాజ్ నాడార్ - ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు,భారత రాజకీయాలలో 'కింగ్ మేకర్', నెహ్రూ కి సన్నిహితుడు,మదురై జిల్లాలో జన్మించారు.
 
9.  బెంగలూరు అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగుళూరు (కర్ణాటక)

 
 
దీనికి ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు పెట్టాలని కన్నడ ప్రజలు ఆకాంక్ష. ON-LINE లో దీనికి సంబందించిన సంతకాల సేకరణ జరుగుతుంది.భారతరత్న సర్  మోక్షగుండం విశ్వేశ్వరయ్య - కోలార్ జిల్లాలోని చిక్భల్లాపూర్(కర్ణాటక) లో జన్మించారు.వీరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కి చెందిన మోక్షగుండం గ్రామస్తులు.హైదరాబాద్ నగరాన్ని మూసి నది వరదలు నుండి కాపాడిన వ్యక్తి. అంతేకాకుండా విశాఖపట్టణం ను సముద్రం కబలించకుండా  నిర్మాణాలను డిజైన్ చేసారు. ఇంకా తిరుపతి నుండి తిరుమలకు ఘాట్ రోడ్ డిజైన్ , కావేరి నది ఫై కృష్ణ రాజ సాగర్ ఆనకట్ట డిజైన్. Father of modern Mysore(Karnataka) state  అని వీరికి బిరుదు.ఈయన పుట్టిన రోజును 'ఇంజనీర్స్ డే' గా ఆచరించబడుతుంది.   

10. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ (ఆంధ్ర ప్రదేశ్) ---- రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం,శంషాబాద్ 


    రాజీవ్ గాంధీ - జవహర్లాల్ నెహ్రూ మనుమడు. తల్లి శ్రీమతి ఇందిరా గాంధీ మరణాంతరం ప్రధాని అయ్యారు.'పర్మిట్ రాజ్' ఎత్తివేత ,టెలికమ్యూనికేషన్స్  మరియు  సైన్సు & టెక్నాలజీని   ప్రోత్సహించిన వ్యక్తి.
   
    ఫై విమానాశ్రయాలకు పెట్టిన వ్యక్తుల పేర్లను పరిశీలిస్తే, ఒక్క హైదరాబాద్ విమానాశ్రయం పేరు  తప్ప మిగతావన్ని సందర్భోచితంగానూ, ఆయా రాష్ట్రాల ప్రజల మనోభావాలకు అనుగుణంగాను, ఆ వ్యక్తులు  ఆయా రాష్ట్రాల ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా  పెట్టిన పేర్లు. ఈ చర్య ఆయా వ్యక్తుల కు, ఆ రాష్ట్ర ప్రజలకు గల సామాజిక,సాంస్క్రుతిక, రాజకీయ అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో గొప్ప నాయకులూ పుట్టారు - ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. ప్రాజెక్టులకు అలాంటి నాయకుల పేర్లు పెట్టుకోవడం మనల్ని మనం గౌరవించుకోవడమే.
     
మన రాష్ట్రంలో పుట్టిన మేథావులు,నాయకులు: 

ఎన్.టి.రామారావు : ప్రఖ్యాత సినీనటులు,మాజీ ముఖ్యమంత్రి,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు,తెలుగు ఆత్మగౌరవ నినాదంతో తెలుగు జాతికి,ఆంధ్రరాష్ట్రానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన ప్రజానాయకుడు, పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వ్యక్తి.        
   
పి.వి. నరసింహారావు : దక్షినాదినుంది ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి - తెలుగువాడు, బహుభాషాకోవిదుడు, భారతదేశాన్ని ఆర్ధిక ఇబ్బందులనుండి  బయటపడేసిన ఆర్ధిక సంస్కర్త. దేశంలో రెండోతరం ఆర్ధిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేసిన మేథావి. ఇప్పుడు భారతదేశం అనుభవిస్తున్న ఆర్ధిక ఫలాలు, సాఫ్టవేర్  వెలుగులు అన్నీ ఆయన చలవే.
 
టంగుటూరి ప్రకాశం పంతులు: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రకేసరి, మద్రాసు ప్రెసిడెన్సి, ఆంధ్ర రాష్ట్రా లకు ముఖ్యమంత్రిగా  పనిచేసారు. తనకంటూ ఏమీ వెనుకేసుకోని గొప్ప నిస్వార్ధపరుడు. ఈయన సేవలకు గుర్తింపుగా ప్రకాశం జిల్లా ఏర్పాటుచేసారు. నేటితరం నాయకులు, ముఖ్యమంత్రులు వీరిని ఆదర్శంగా తీసుకుంటే బాగుండేది.

  భోగరాజు పట్టాభి సీతారామయ్య : ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రాబ్యాంక్ వ్యవస్థాపకులు, భారత రాజ్యాంగ రచనాసంఘం సభ్యులు.
               
సర్.ఆర్థర్ కాటన్ దొర : జన్మతః తెలుగువాడు కానప్పటికీ తెలుగువాడు చేయని మేలు ఈ జాతికి చేసాడు.తెలుగు నేలను సస్యశామలం చేసిన అపర భగీరధుడు. తెలుగువాడు తినే ప్రతి మెతుకులోనూ ఈయన రూపం కనిపిస్తుంది.    

 ఎల్లాప్రగడ సుబ్బారావు, సర్వేపల్లి రాధాకృష్ణ, అల్లూరి సీతారామరాజు, దామోదరం సంజీవయ్య, డా.కే.ఎల్.రావు,పుచ్చలపల్లి సుందరరామిరెడ్డి(సుందరయ్య),పొట్టి శ్రీరాములు మొదలగు వారంతా మన రాష్ట్రం వారే. ఇంకా ఎంతోమంది ప్రముఖులు ఈ రాష్ట్రానికి సేవ చేసారు. వీరిలో ఏ ఒక్కరి పేరైనా  శంషాబాద్ విమానాశ్రయానికి పెట్టివుంటే బాగుండేది. తమ రాజకీయ లబ్ధి కోసం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టుపెట్టే మన నాయకులు ఆ పని ఎందుకు చేస్తారు?


Sunday, September 27, 2009

పరిపాలన నుండి రాజకీయాలను వేరు చేయలేమా?




Is It possible politics administration dichotomy?
                       త్వరలో                                                                                                                                                                         (woodrow wilson) 

Thursday, September 24, 2009

జగన్ సి.ఎం అయితే రాష్ట్రం రామరాజ్యం అయిపోతుందా?


 

వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో జరుగుతున్న ప్రదర్శనలు, డిమాండ్ లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి.
"జగన్ ను సి.ఎం చెయ్యాలి"
"వై.యస్ వారసుడు జగన్" 
"జనం కోసం జగన్,జగన్ వెంట జనం"
"జగన్  ను  సి .ఎం చెయ్యకపోతే రాజీనామా చేస్తాం"



 
            


ఇదీ ... ప్రదర్శనకారులు, జగన్ అభిమానులు జపిస్తున్న మంత్రం. ఇదంతా చూస్తుంటే ... మనం రాచరికంలో  ఉన్నామా?  లేక  ప్రజాస్వామ్యంలో  ఉన్నామా? అనే  సందేహం వస్తుంది.  రాచరికంలో  రాజు చనిపోతే  ఆయన  కొడుకు  లేదా సమీప  వారసుడు రాజు కావడం  సంప్రదాయం, కానీ ప్రజాస్వామ్యంలో రాజు(ప్రభుత్వాధినేత)కావాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కొన్ని నియమాలను, సంప్రదాయాలను పాటించాలి. అంతకుమించి ఆ స్థాయికి ఎదగాలంటే సమర్ధత అతి ముఖ్యమైన అంశం. రాచరికంలో కూడా రాజు కావాలంటే యువరాజు కొన్ని అర్హతలను  సంపాదించాలి.  అవి ... యుద్ద విద్యలలో ప్రావీణ్యం, దక్షత, వ్యవహారిక జ్ఞానం. ఇవేవీ  లేనివారు  రాజు కాలేకపోయిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నాయకుడు కావాలంటే ... ప్రజల ప్రయోజనాలను  కాపాడే తత్వం, రాజకీయ సమర్ధత, ప్రజల సొమ్మును సద్వినియోగం చేయడం అవసరం.
         జగన్ అభిమానులకు ఇవేమీ పట్టనట్లు ఉంది. అసలు జగన్ సి.ఎం. కావడానికి ఆయనకున్న అర్హతలేమిటి? కేవలం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కొడుకు కావడం ఒక్కటేనా అర్హత? లేక ఇతర అర్హతలు ఎమైనా ఉన్నాయా?  జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రామరాజ్యం అయిపోతుందా? రాష్ట్రంలో సమస్యలు సమసిపోతాయా? కందిపప్పు, బియ్యం, ఇతర నిత్యావసరవస్తువుల ధరలు నేలనంటుతాయా?  లేక స్వైన్ - ఫ్లూ  వచ్చినదారినే వెనక్కు వెల్లిపోతుందా? జగన్ సి.ఎం అయితే అద్భుతాలు ఏమీ జరగవు - ఆయన అభిమానుల కోరిక నెరవేరడం తప్ప.
       



ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు 


 




ISRO వారి సాటిలైట్ ఛాయాచిత్రం - దీని ద్వారానే ప్రమాద ప్రాంతాన్ని కనిపెట్టారు 


ఇప్పటికిప్పుడు జగన్ ను సి.ఎం చేసేయ్యాల్సిన  అవసరం ఏమొచ్చింది? జగన్మోహనరెడ్డి కంటే సమర్ధులు, సీనియర్లు  రాష్ట్ర కాంగ్రెస్ లో లేరా? ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కంటే ఆయన ఏవిధంగా మెరుగు? ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోశయ్య కంటే జగన్ కు ఎక్కువ ఏమి తెలుసు? ఇవన్నీ జగన్ సి.ఎం కావడానికి అడ్డంకులే. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు... దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ అంతటి వ్యక్తికే ఈ స్థాయికి (ముఖ్యమంత్రి కావడానికి) ఎదగడానికి 20 సంవత్సరాలు పట్టింది. జగన్ ఆయన కంటే సమర్ధుడా? అతను తమ స్వంత   వ్యాపారాలను సమర్ధవంతంగా  నడపవచ్చుగాక  - కానీ వ్యాపారాలను చక్కబెట్టడం  వేరు, రాష్ట్ర వ్యవహారాలను చక్కబెట్టడం వేరు. అసలు జగన్ కు ఉన్న రాజకీయ అనుభవం ఎంత? కేవలం నాలుగు నెలలు!(2009 సార్వత్రిక ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం నుండి ఎన్నికయ్యారు). ఈ నలుగు నెలల అనుభవంతోనే రాష్ట్రాన్ని నడిపెయోచ్చా? ఇదేమీ సినిమా స్టొరీ కాదు - 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. జగన్ అభిమానులకు ఆయనను సి.ఎం గా చూడాలని ఉండటంలో తప్పులేదు - అది వారి వ్యక్తిగత అభిప్రాయం. రాష్ట్ర ప్రజలందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారనడం సరికాదు. అభిమానంతో రాష్ట్ర భవిష్యత్తును ఒక అనుభవరహితుడి చేతిలో పెట్టడానికి ప్రజలు సిద్దంగా లేరు.                       
కూడలి
మాలిక: Telugu Blogs