Thursday, September 24, 2009

జగన్ సి.ఎం అయితే రాష్ట్రం రామరాజ్యం అయిపోతుందా?


 

వై.యస్.రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రాష్ట్రంలో జరుగుతున్న ప్రదర్శనలు, డిమాండ్ లు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి.
"జగన్ ను సి.ఎం చెయ్యాలి"
"వై.యస్ వారసుడు జగన్" 
"జనం కోసం జగన్,జగన్ వెంట జనం"
"జగన్  ను  సి .ఎం చెయ్యకపోతే రాజీనామా చేస్తాం"



 
            


ఇదీ ... ప్రదర్శనకారులు, జగన్ అభిమానులు జపిస్తున్న మంత్రం. ఇదంతా చూస్తుంటే ... మనం రాచరికంలో  ఉన్నామా?  లేక  ప్రజాస్వామ్యంలో  ఉన్నామా? అనే  సందేహం వస్తుంది.  రాచరికంలో  రాజు చనిపోతే  ఆయన  కొడుకు  లేదా సమీప  వారసుడు రాజు కావడం  సంప్రదాయం, కానీ ప్రజాస్వామ్యంలో రాజు(ప్రభుత్వాధినేత)కావాలంటే రాజ్యాంగం నిర్దేశించిన కొన్ని నియమాలను, సంప్రదాయాలను పాటించాలి. అంతకుమించి ఆ స్థాయికి ఎదగాలంటే సమర్ధత అతి ముఖ్యమైన అంశం. రాచరికంలో కూడా రాజు కావాలంటే యువరాజు కొన్ని అర్హతలను  సంపాదించాలి.  అవి ... యుద్ద విద్యలలో ప్రావీణ్యం, దక్షత, వ్యవహారిక జ్ఞానం. ఇవేవీ  లేనివారు  రాజు కాలేకపోయిన సందర్భాలు చరిత్రలో అనేకం ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో నాయకుడు కావాలంటే ... ప్రజల ప్రయోజనాలను  కాపాడే తత్వం, రాజకీయ సమర్ధత, ప్రజల సొమ్మును సద్వినియోగం చేయడం అవసరం.
         జగన్ అభిమానులకు ఇవేమీ పట్టనట్లు ఉంది. అసలు జగన్ సి.ఎం. కావడానికి ఆయనకున్న అర్హతలేమిటి? కేవలం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కొడుకు కావడం ఒక్కటేనా అర్హత? లేక ఇతర అర్హతలు ఎమైనా ఉన్నాయా?  జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం రామరాజ్యం అయిపోతుందా? రాష్ట్రంలో సమస్యలు సమసిపోతాయా? కందిపప్పు, బియ్యం, ఇతర నిత్యావసరవస్తువుల ధరలు నేలనంటుతాయా?  లేక స్వైన్ - ఫ్లూ  వచ్చినదారినే వెనక్కు వెల్లిపోతుందా? జగన్ సి.ఎం అయితే అద్భుతాలు ఏమీ జరగవు - ఆయన అభిమానుల కోరిక నెరవేరడం తప్ప.
       



ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాద దృశ్యాలు 


 




ISRO వారి సాటిలైట్ ఛాయాచిత్రం - దీని ద్వారానే ప్రమాద ప్రాంతాన్ని కనిపెట్టారు 


ఇప్పటికిప్పుడు జగన్ ను సి.ఎం చేసేయ్యాల్సిన  అవసరం ఏమొచ్చింది? జగన్మోహనరెడ్డి కంటే సమర్ధులు, సీనియర్లు  రాష్ట్ర కాంగ్రెస్ లో లేరా? ప్రస్తుత ముఖ్యమంత్రి రోశయ్య కంటే ఆయన ఏవిధంగా మెరుగు? ప్రస్తుత రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి రోశయ్య కంటే జగన్ కు ఎక్కువ ఏమి తెలుసు? ఇవన్నీ జగన్ సి.ఎం కావడానికి అడ్డంకులే. వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గొప్ప నాయకుడు... దానిలో ఎలాంటి సందేహం లేదు. కానీ అంతటి వ్యక్తికే ఈ స్థాయికి (ముఖ్యమంత్రి కావడానికి) ఎదగడానికి 20 సంవత్సరాలు పట్టింది. జగన్ ఆయన కంటే సమర్ధుడా? అతను తమ స్వంత   వ్యాపారాలను సమర్ధవంతంగా  నడపవచ్చుగాక  - కానీ వ్యాపారాలను చక్కబెట్టడం  వేరు, రాష్ట్ర వ్యవహారాలను చక్కబెట్టడం వేరు. అసలు జగన్ కు ఉన్న రాజకీయ అనుభవం ఎంత? కేవలం నాలుగు నెలలు!(2009 సార్వత్రిక ఎన్నికలలో కడప పార్లమెంటు స్థానం నుండి ఎన్నికయ్యారు). ఈ నలుగు నెలల అనుభవంతోనే రాష్ట్రాన్ని నడిపెయోచ్చా? ఇదేమీ సినిమా స్టొరీ కాదు - 8 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. జగన్ అభిమానులకు ఆయనను సి.ఎం గా చూడాలని ఉండటంలో తప్పులేదు - అది వారి వ్యక్తిగత అభిప్రాయం. రాష్ట్ర ప్రజలందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారనడం సరికాదు. అభిమానంతో రాష్ట్ర భవిష్యత్తును ఒక అనుభవరహితుడి చేతిలో పెట్టడానికి ప్రజలు సిద్దంగా లేరు.                       

No comments:

Post a Comment

కూడలి
మాలిక: Telugu Blogs