Saturday, October 03, 2009

మా జగన్ ని సి.ఎం చేయండి : చంద్రబాబుకి వై.ఎస్ ఫోను

రాజశేఖర్ రెడ్డి మరణం - జగన్ ను సి.ఎం చేయాలన్న డిమాండ్లు - నిరసనల నేపధ్యంలో సరదాకి రాస్తున్న కల్పిత సంభాషణ.ఎవరినీ  బాధ  పెట్టడానికి  కాదు. 


పై లోకాల్లోనున్న వై.ఎస్ కు తన కొడుకు జగన్ ఇంకా సి.ఎం కాలేదన్న బెంగపట్టుకుంది. ఎలాగైనాసరే రంగంలోకి దిగి కొడుకుని సి.ఎం చేసెయ్యాలని ఫోన్ అందుకుని మొదట తన ప్ర్రియ మిత్రుడు K.V.P  కి డయల్ చేసాడు.

వై.ఎస్ : హలో ... మిత్రమా ఎలా ఉన్నావు?
కే.వి.పి : హలో ... ఎవరు? వై.ఎస్సా? ఎన్నాళ్లైంది మిత్రమా నీ గొంతు విని .... నెలరోజులైపోయింది కదూ!?.
వై.ఎస్ : (బాధగా ...) అవును. అంతా ఆ పాడు హెలికాప్టర్ వల్లే జరిగింది. ఇంతకూ మన జగన్ ని సి.ఎం చేసే  కార్యక్రమం ఎంతవరకూ వచ్చింది?
కే.వి.పి : (నాన్చుతూ ... ) ఆ పనిమీదే ఉన్నాను. జూనియర్లు అంతా  మన పక్షాన్నే .... సీనియర్లే  తలెగరేస్తున్నారు. నువ్వు వాళ్ళని తొక్కేసావన్న కోపంతో మన జగన్ కి సహకరిస్తాలేదు.
వై.ఎస్ : అవును మరి. మన కాంగ్రెస్ లో ఇదంతా కామనే. ఏది ఏమైనా జగన్ ని సి.ఎం చేసే బాధ్యత నీదే -   అని ఫోన్ పెట్టేసాడు.

   ఆ తరువాత రోశయ్యకి ఫోన్ చేసాడు

వై.ఎస్ : రోశయ్య గారు ఎలా ఉన్నారు?
రోశయ్య : నిక్షేపంలా ఉన్నాను .... అంతా మీ దయ.
వై.ఎస్ :  మా జగన్ ని సి.ఎం ఎప్పుడు చేస్తున్నారు?
రోశయ్య : నా చేతుల్లో ఏముంది - హై కమాండ్  ఎప్పుడంటే అప్పుడు
వై.ఎస్ : మీరు కూడా జగన్ కి  సపోర్ట్  చేస్తాలేదంట ? ... మా కే.వి.పి చెప్పాడు.
రోశయ్య : అబ్బబ్బే అలాంటిదేం లేదు.మీరంటే నాకు ఎంతో గౌరవం, అందుకే నేనింకా ....... సి- బ్లాక్ లోకి     మారలేదు. కొత్త పధకాలన్నింటికి మీ పేరే పెడుతున్నాను.



ఇక లాభం లేదని ... డైరెక్టుగా హై కమాండ్ తోనే ఈ విషయం తేల్చుకోవాలని సోనియా గాంధీకి ఫోన్ చేసాడు.

వై.ఎస్ :  నమస్కారం మేడం
సోనియా గాంధీ సెక్రటరి : నమస్కారం. ఎవరు మీరు?
వై.ఎస్ : నేను వై.ఎస్ ను
సెక్రటరీ : ఓ మీరా ?!  మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మేడం బిజీగా ఉన్నారు , తరువాత ఫోన్ చేయండి
వై.ఎస్ :( నేను సూటుకేసులతో డబ్బులిచ్చేటప్పుడు మేడం బిజీగా ఉండరేమో - అని మనసులో తిట్టుకుంటూ )  లేదు మేడంతో అర్జంటుగా మాట్లాడాలి.
     
  సోనియా గాంధీ లైన్లోకొచ్చారు

వై.ఎస్ : నమస్కారం మేడం
సోనియా : రెడ్డి గారు నమస్కారం ... ఎలా ఉన్నారు?
వై.ఎస్ : (బాధగా ... ) ఏదో ఉన్నాను మేడం - మా జగన్ ని ఎప్పుడు సి.ఎం చేస్తున్నారు?
సోనియా : ఇప్పుడు కుదరదు రెడ్డిగారు .... మీ వాడికి అనుభవం సరిపోదు,పైగా సీనియర్లు ఒప్పుకోవడంలేదు.
వై.ఎస్ :రాష్ట్రంలోని అన్ని  నిర్మాణాలకు, పధకాలకు  మీ అత్తగారూ,పెనిమిటి  పేర్లే  పెట్టాను పైగా   ముప్పైమూడు మంది ఎం.పి లను గెలిపించి మీ చేతిలో పెడితే ఇదా మీరు చూపించే కృతజ్ఞత?
సోనియా : తప్పదు వై.ఎస్. ఇదే రాజకీయమంటే .
వై.ఎస్ : ఇంకా నయం ఆంధ్రప్రదేశ్ ను రాజీవ్ ప్రదేశ్ గా మర్చేద్దామనుకున్నాను ... కొంపలంటుకుపోయేవి - అని ఫోన్ పెట్టేసాడు.         
 
వై.ఎస్ బాధపడుతూ అధికారంలో ఉన్నపుడు ఇవేమీ తెలిసేవి కాదు,ఇప్పుడు అందరి రంగులు బయటపడుతున్నాయి అని మనసులో అనుకుని చివరి ప్రయత్నంగా తన చిరకాల మిత్రుడు చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసాడు.
 
వై.ఎస్ : హలో .... చంద్రబాబూ ఎలా వున్నావు?
చంద్రబాబు : అన్నా నువ్వా!?  చాలా బాగున్నాను.
వై.ఎస్ : నువ్వైనా మా జగన్ ని  సి.ఎం చెయ్యొచ్చు కదా?
చంద్రబాబు : దానికి మీ పార్టీ వాళ్ళు వున్నారు కదా నేనెందుకు?
వై.ఎస్ : వాళ్ళెవరూ మా వాడ్ని పట్టించుకోవడం లేదు , కనీసం నువ్వైనా ........
చంద్రబాబు : నా వల్ల అవుతుందా ?
వై.ఎస్ : అమ్మమ్మా .... అలా అనకు   కేంద్రంలోనూ, రాష్ట్రంలోను  ఎన్నోసార్లు చక్రం తిప్పినోడివి - నీ వల్ల కాకపోతే ఇంకెవరివల్ల అవుతుంది.
చంద్రబాబు :( సంశయిస్తూ ..... ) నిజమే అనుకో ..... కానీ
వై.ఎస్ : కానీ లేదు గీనీ లేదు ..... అసెంబ్లీలో ఎన్ని తిట్టుకున్నా బయట మనమంతా ఒక్కటే కదా. మా వాడి కోసం మరోసారి చక్రం తిప్పు.
చంద్రబాబు :  చక్రం తిప్పడానికి మీ కే.వి.పి ఉన్నాడు కదా .... నేనెందుకు ? 
వై.ఎస్ : మా కే.వి.పి కి నీ అంత టాలెంటు లేదులే

చంద్రబాబు : ( ఏదో చెప్పబోతుండగా ....... )
     వాతావరణం సరిగా లేక లైన్ కట్ అయ్యింది . ఎన్నిసార్లు ప్రయత్నిచినా లైన్ కలవలేదు. వై.ఎస్ నిట్టురుస్తూ తన జగన్ సి.ఎం కాడేమోనన్న బెంగతో ఇడుపులపాయకి వెనుదిరిగాడు.


                       ఈ-మెయిల్ : msrinivasu275@gmail.com 

No comments:

Post a Comment

కూడలి
మాలిక: Telugu Blogs