Friday, October 16, 2009

కుళ్ళు రాజకీయాలు .... మంచి రాజకీయాలు విడిగా వుంటాయా?

   మొన్నీమధ్య నేను  ' బావార్చి'  లో హైదరాబాద్  బిర్యాని  తింటుంటే  పాత  మిత్రుడు  కలిసాడు. వాడు నాకు ఇంజనీరింగ్ లో క్లాస్మేటు. ఇద్దరం బిర్యాని తింటూ పాత విషయాలన్నీ మాట్లాడుకున్నాం. ఆ తరువాత టాపిక్ రాజకీయాలవైపు మళ్ళించాను. వాడికి రాజకీయాలంటే బొత్తిగా ఆసక్తి లేదు. క్రికెట్ ఉంటే బతికేస్తాడు. " Eat cricket, sleep cricket  టైపు ". ఆ విషయం తెలిసీ .... ఉండబట్టలేక జగన్ సి.ఎం అవుతాడంటావా ? -  అని అడిగాను. దానికి వాడు " ఈ కుళ్ళు రాజకీయాల గొడవ మనకెందుకు మామా? శుభ్రంగా బిర్యాని తిను " అన్నాడు." ఈ మధ్య ప్రతీవాడికీ  కుళ్ళు రాజకీయాలు  అనడం ఫ్యాషన్ అయిపోయింది "  అన్నాను. దానికి వాడు కొంచెం ఫీలయ్యి " జగన్ సి. ఎం అయితే మనకేమొస్తుంది .... కాకపోతే మనదేంపోతుంది"? అన్నాడు. అందరి జీవితాలను ఎంతోకొంత ప్రభావితం చేసేవి రాజకీయాలే కదా - వాటిని తెలుసుకోపోతే ఎలా? అన్నాను. "మంచి రాజకీయాలైతే తెలుసుకోవచ్చు, కుళ్ళు రాజకీయాలను తెలుసుకుని ఏం చేస్తాం"? అన్నాడు.  ఈలోపు బిర్యాని తినడం పూర్తవడంతో ఎవడి దారిన వాడు వెళ్ళిపోయాం. ఈమధ్య ఎవడ్ని కదిలించినా ఈ కుళ్ళు రాజకీయాలు మాకెందుకు అనేవాడే!. ఒక్కడు కూడా రాజకీయాల్లోకొచ్చి ఈ కుళ్ళును కడిగేస్తాం  అనడం లేదు. జరిగేవన్నీ మంచి రాజకీయాలైతే  ఎవడైనా రాజకీయాల్లోకొస్తాడు. కుళ్ళు రాజకీయాల్లో ప్రవేశించి ... ఆ కుళ్ళును కడిగేయడమే అసలు సిసలు రాజకీయం. ఇంతకీ రాజకీయాలు మంచివా?  లేక చెడ్డవా?. మంచి రాజకీయాలు - కుళ్ళు రాజకీయాలు అని విడిగా  ఉంటాయా?  రాజుల కాలం నుండీ ఈ చర్చ సాగుతూనే వుంది.

      రాజకీయాలు మంచివా - చెడ్డవా ?  అనేది వ్యక్తులను బట్టి వుంటుంది. మంచివాళ్ళు చేస్తే అవి సమాజానికి మేలు చేస్తాయి - చెడ్డవాళ్ళు చేస్తే కీడును కలిగిస్తాయి. రాజకీయాలు ప్రజా శ్రేయస్సు కోసం. కేవలం ప్రజాప్రయోజనమే రాజకీయ ప్రక్రియ పరమోద్దేశ్యం.అది వ్యక్తిగత  ప్రయోజనం చేకుర్చేదిగా వుండకూడదు - సమాజానికంతటికీ ప్రయోజనం చేకూర్చాలి. శ్రీరాముడు వాలిని చెట్టుచాటునుండి చంపాడు - ఇది ఏ తరహా రాజకీయం? దానివల్ల ఎవరికి ప్రయోజనం కలిగింది - శ్రీరాముడికా? సుగ్రీవుడికా? లేక వానర జాతికా ?



 
మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసినది ఏ రాజకీయం ? ఆయన అలా ఎందుకు చేసాడు? దుష్టులను శిక్షించి - శిష్టులను రక్షించడానికేనా ? లేక పాండవులకు రాజ్యం కట్టబెట్టడానికా?. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు శిఖండిని అడ్డంపెట్టుకుని భీష్మున్ని చంపడం మంచి రాజకీయమేనా?. తనను అవమానించిన కౌరవులను నాశనం చేయడానికి శకునిమామ ఆడిన ' మాయాజూదం' - మంచిదా? చెడ్డదా?. భారతస్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ చేసిన రాజకీయం ఎలాంటిది? దేశభక్తులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లను ఉరిశిక్ష  నుండి  రక్షించగలిగే స్థితిలో ఉండి కూడా గాంధీజీ ఆ పని చేయలేదు - అది ఏ రాజకీయం? . తెలుగుదేశం పార్టీలో సంభవించిన "ఆగస్టు సంక్షోభాలు" ఎలాంటి రాజకీయాలకు సంకేతం?.

      రాజకీయాలు అగ్గి లాంటివి .... అగ్గిని వంట చేయడానికీ ఉపయోగించొచ్చు-  కొంపలు తగలెట్టడానికీ ఉపయోగించొచ్చు. కాకపోతే దాన్ని ప్రయోగించిన పరమార్ధమే తేడా. రాజకీయాలు తస్మదీయులకు ప్రయోజనాన్ని- అస్మదీయులకు ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి. దీనికి ఉదాహరణ కీ.శే. వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి. ఆయన తనను నమ్ముకున్న వాళ్ళకోసం ఎంతకైనా తెగించే టైపు - తనను వ్యతిరేకించే వాళ్ళను తుంచేసే టైపు. ఇక్కడ నమ్ముకున్నవాళ్ళు అంటే ప్రజలు మాత్రం కాదండోయ్ .... వందిమాగధులు. రాజకీయాల్లో సమాజ శ్రేయస్సు ఇమిడి ఉండాలి. అప్పుడే అవి మంచి రాజకీయాలౌతాయి. రాజకీయాలు సమాజం కోసం - వ్యక్తుల కోసం కాదు. పూర్వం రాజకీయాలు రాజులకే పరిమితమైన ఆట. తరువాత సంస్థానాధీశులు, జమిందార్లు రాజకీయాలు చేసారు. ఆ తరువాత డబ్బున్నవాళ్ళు చేసారు, ఇప్పుడు సామాన్యుడి వంతు - ఈ మధ్యలో సినిమావాళ్ళు కూడా రాజకీయాలు చేసారు.ఎవడు రాజకీయం చెసినా గాని దాని పరమార్ధం మాత్రం  నెరవేరడం లేదు - ఇదేనా  రాజకీయం అంటే !?.                                                                  

                              -శీను
      ఈ-మెయిల్: msrinivasu275@gmail.com 

2 comments:

  1. అదీ కాక "మీరే ఆ విషయాన్ని రాజకీయం చేస్తున్నారు", "దాన్ని రాజకీయం చేయవద్దు" అన్నప్పుడే తమ వృత్తి గురించి తమకున్న గౌరవభావాన్ని వెల్లడిస్తుంటారు మన రాజకీయనాయకులు కాబట్టి కుళ్ళు రాజకీయాలు, తెల్ల రాజకీయాలు అని మళ్ళీ మనం విమర్శించడం అనవసరం.

    ReplyDelete

కూడలి
మాలిక: Telugu Blogs